దెబ్బ మీద దెబ్బతో జగన్ ఉక్కిరిబిక్కిరి

Supreme-Court-Judgement-on-Convicted-Politicians-Apllies-to-Jagan

Supreme-Court-Judgement-on-Convicted-Politicians-Apllies-to-Jagan

టైం బాగోలేనప్పుడు.. టెంకాయ కూడా టైంబాంబు మాదిరి పేలుతుందంటే ఇదేనేమో. ప్రజల్లో సానుభూతిని తెచ్చుకోగలిగాం.. ఇంక ఏదోలా ఎన్నికలు వచ్చేలా చేసుకుంటే.. ముఖ్యమంత్రి అయిపోవచ్చని గంపెడాశలు పెట్టుకొని చంచలగూడ జైల్లో రోజులు లెక్క పెట్టుకుంటున్న జగన్ కు పెద్ద కష్టమే వచ్చి పడింది. కేవలం 48గంటల వ్యవధిలో ఆయనకు అన్నీ అపశకునాలే.

నేరారోపణ జరిగిన రాజకీయ నాయకులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా సుప్రీం తీర్పు ఇచ్చి టెన్షన్ పెడితే.. ఇప్పుడు ఏకంగా.. అసలుకే ఎసరు వచ్చేలా తీర్పు ఇవ్వటం జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కస్టడీలొ ఉన్నా.. జైల్లో ఉన్నా సరే, అలాంటివారు “ఎన్నికల్లో పోటీ చేసేందుకు కుదరదు’” అంటూ సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు దెబ్బకు వైఎస్సార్ కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయనే చెప్పాలి. నిన్నటి తీర్పు వచ్చినప్పుడు.. నేరం నిరూపితమై.. శిక్ష పడినప్పుడు సంగతి.. అలాంటివాటివల్ల మనకు ఇబ్బంది ఉండదని బింకం పోయిన వారికి తాజా తీర్పు షాక్ కొట్టినంత పనైంది.

దగ్గరదగ్గర ఏడాదిన్నర నుంచి జైల్లో ఉంటూ.. ఇంకెంత కాలం ఉండాలో తెలీక తికమక పడుతున్న జగన్ బాబుకు.. తాజా తీర్పుతో పెద్ద చిక్కు వచ్చి పడింది. త్వరలో న్యాయస్థానం ముందుకు రానున్న బెయిల్ పిటీషన్ విచారణలోనైనా బయటపడితే అదే పదివేలన్నట్లుగా మారింది. ఒకవేళ అప్పటికి బెయిల్ రాకపోతే.. మరో ఆర్నెల్ల వరకు బెయిల్ పిటీషన్ పై విచారణకు అవకాశం పోతుంది. అంటే..ఎన్నికల ముందు బయటకు వచ్చి చక్రం తిప్పాలంటే.. త్వరలో విచారణకు రానున్న బెయిల్ పిటీషన్ పై న్యాయస్థానం సానుకూలంగా స్పందించాల్సి ఉంటుంది. మరి.. ఈసారైనా జగన్ కు కాలం కలిసి వస్తుందో లేదో చూడాలి.