టీలో షుగర్ లేదని దీక్షా? మీ నాన్న చిచ్చే: జగన్‌కు వర్ల

india-seemandhra-tdp-mps-deeksha-at-mahatma-gandhi-statue

india-seemandhra-tdp-mps-deeksha-at-mahatma-gandhi-statue

హైదరాబాద్/విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చంచల్‌గూడ జైలులో ఎందుకు దీక్ష చేస్తున్నారని, తనకు జైలులో ఇచ్చే టీలో షుగర్ లేదని చేస్తున్నారా చెప్పాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య సోమవారం ఎద్దేవా చేశారు. ఆయన విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ గతంలో జల దీక్ష, ఫీజు దీక్షల పేరుతో ఎన్నో చేశారని, వాటితో ఏం సాధించారన్నారు.

ప్రజలను మోసం చేసేందుకే జైల్లో దీక్ష చేస్తున్నారన్నారు. తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డు పెట్టుకొని లక్షకోట్లు సంపాదించి, ముఖ్యమంత్రి పదవి కోసం ఆరాటపడిన వ్యక్తిగా జగన్ రాష్ట్రంలో చాలా సుపరిచితుడని ఎద్దేవా చేశారు. జైలులో రిమాండు ఖైదీగా ఉన్న జగన్ ఏ హోదాలో దీక్ష చేస్తున్నారన్నారు.

జైలులో ఆహారం సరిగా లేదనా, స్నానానికి నీరు సరిగా లేదనా, టీలో షుగర్ సరిగా లేదని దీక్ష చేస్తున్నావా చెప్పాలని ఎద్దేవా చేశారు. సమైక్యాంధ్ర కోసమే దీక్ష చేస్తే అది నీ తండ్రి వైయస్ పెట్టిన చిచ్చే అన్నారు. నీ తండ్రి నిర్ణయానికి వ్యతిరేకంగా దీక్ష చేస్తే చెప్పాలన్నారు. ఆయన దీక్ష బూటకం, నాటకం, హాస్యాస్పదమని మండిపడ్డారు. జైలులో రాజకీయాలకు తావు లేదని మరి, జగన్ దీక్షపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏమంటారో వివరించాలన్నారు.

తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కయ్యాయన్నారు. సోనియాకు, జగన్‌కు మధ్య ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. లక్ష కోట్లు దోచుకున్న నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్‌కు సమైక్యాంధ్ర కోసం దీక్ష చేసే అర్హత లేదన్నారు. అవినీతిపరుడనే ముద్ర తొలగించుకునే ఉద్దేశ్యంలో భాగంగా ఈ దీక్ష చేస్తున్నారన్నారు. సీమాంధ్ర రక్షణ కోసం తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో పోరాడుతుంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీలు ఏం చేస్తున్నారని టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు హైదరాబాదులో ప్రశ్నించారు. పరకాలలో విజయమ్మ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారని, విభజనపై ఇడుపులపాయలో జగన్ పార్టీ తీర్మానం చేసిందని తెలిపారు.

Comments are closed.