సీమాంధ్రులు పిచ్చి వేషాలు వేయొద్దు! – ఈటెల రాజేందర్

సీమాంధ్ర ఉద్యమకారులకు టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు. పిచ్చిపిచ్చి వేషాలు వేయకుండా ఉద్యం చేసుకోవాలని ఆయన హెచ్చరించారు. లేదంటే.. తెలంగాణలోని నల్లరేగడి భూముల్లో నివశిస్తున్న ఆంధ్రా పల్లెవాసులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ఆయన ప్రకటించారు. హద్దులు దాటితే తెలంగాణ ప్రజలు చేతులు ముడుచుకుని కూర్చోబోరన్నారు. 

సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యోగాలు చేస్తున్న తెలంగాణ ఉద్యోగులపై సీమాంధ్ర ఉద్యోగులు దాడి చేసినట్టు వచ్చిన వార్తలుపై ఈటెల శుక్రవారం మీడియా సమావేశంలో ఖండించారు. సీమాంధ్ర ప్రాంతంలో తెలంగాణ మహిళా ఉద్యోగులపై పేడతో కొట్టడమే సీమాంధ్ర సంస్కృతా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాళ్లను ఏనాడు తెలంగాణ వాళ్లు ఇబ్బందిపెట్టలేదని తెలిపారు. సీమాంధ్రులను తెలంగాణ ప్రాంత ప్రజలు తమ పొట్టల్లో పెట్టుకుని కాపాడారని గుర్తు చేశారు. 

కానీ, సీమాంధ్రులు తద్విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ ఒక్క విషయాన్ని సీమాంధ్ర ఉద్యమకారులు గుర్తు పెట్టుకోవాలన్నారు. తెలంగాణలోని నల్లరేగడి భూముల్లో వందలాది ఆంధ్రా పల్లెలు ఉన్నాయన్నారు. అందరిని ఆదరించే గౌరవించే గొప్ప సంస్కృతి తెలంగాణ ప్రజలదని స్పష్టం చేశారు. మేం స్నేహ హస్తాన్ని అందిస్తున్నాం. సీమాంధ్ర నేతలు భస్మాసుర హస్తాన్ని చాటుతున్నారు విమర్శించారు.