జగన్‌ అన్నరాగానే భారీ బహిరంగ సభ గ్యారంటీ..

YSRCP-Hopes-on-Jagan-Bail

YSRCP-Hopes-on-Jagan-Bail

‘అన్నీ ఉన్నాయి అయిదోతనం తప్ప’ అన్న సామెత చందంగా ఉన్నది వైఎస్సార్‌ కాంగ్రెసు పార్టీ పరిస్థితి. ఆ పార్టీ తరఫున యాత్రలు గట్రా బీభత్సంగా జరుగుతున్నాయి. కునారిల్లుతున్న కాంగ్రెసు పార్టీనుంచి ఇంకా వలసల్ని ప్రోత్సహించడానికి అవసరమైన తాయిలాలను ప్రకటించడానికి కూడా వ్యూహరచనలు సాగుతూ ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న సంక్షోభ పరిస్థితులను గరిష్టంగా క్యాష్‌ చేసుకుని లబ్ధి పొందడానికి కేవలం యాత్రలే కాకుండా, తిరుపతి విజయవాడ, విశాఖపట్టణంలలో భారీ బహిరంగ సభలు నిర్వహించడానికి కూడ రంగం సిద్ధం అవుతోంది. ఎంతటి వ్యయప్రయాసలకోర్చి అయినా సరే ఈ సభలను నిర్వహించాలని కూడా అనుకుంటున్నారు. ఇవన్నీ చాలా బాగానే ఉన్నాయి గానీ.. ఆ పార్టీ నుదుట అయిదోతనం మాత్రం లేదు. పార్టీ అధ్యక్షుల వారు ప్రస్తుతానికి ఇంకా జైల్లోనే ఉన్నారు. బైలుపై వస్తారని కార్యకర్తలు, నాయకులు కలలు కంటున్నారు. బుల్లెట్‌ట్‌ ప్రూఫ్‌ స్కార్పియోపై సీబీఐ కోర్టు దాకా రావాల్సిందే తప్ప.. బెయిలుపై పార్టీ ఆఫీసు దాకా వచ్చే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు.

అయితే పార్టీ మాత్రం అన్న వస్తే పండగే అన్న చందంగా సెలబ్రేట్‌ చేసుకోవడానికి సిద్ధం అయిపోతోంది. జగన్‌ కు ఎంతో ఆప్తుడు అయినటువంటి మాజీ ఎంపీ బాలశౌరి ఇటీవల జగన్‌తో జైలులో ములాఖత్‌ అయిన సందర్భంగా.. జగన్‌ బయటకు రాగానే తను ఓ భారీ బహిరంగ సభ నిర్వహించి పార్టీలో చేరుతానంటూ చాలా ఆర్భాటంగా ప్రకటించారు. (అంటే జగన్‌ జైల్లోనుంచి రాకపోతే బాలశౌరికి వైకాపాలో చేరే ఉద్దేశం లేదా అని ప్రశ్నించకండి.. ).
కానీ, కేవలం బాలశౌరి సభ మాత్రమే కాదు. జగనన్న జైలునుండి బయటకు రావాలేగానీ.. సీమాంధ్రలోని మూడు ప్రాంతాల్లోనూ భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడానికి పార్టీ నాయకులు ప్రిపేర్‌ అయిపోయారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ మరో నెలరోజుల్లో బెయిల్‌ రావడం పూర్తవుతుందని పార్టీ శ్రేణులు విశ్వసిస్తున్నాయి. చంద్రబాబు మంత్రాంగం ఫలించడం ద్వారా గానీ, లేదా స్వతహాగా గానీ ఇదే సమయంలో ఈడీ కూడా రంగంలోకి దిగి, చుట్టూ కేసులు బిగిస్తే తప్ప.. జగన్‌ బెయిలు గ్యారంటీ అని అనుకుంటున్నారు. అన్న బయటకు రాగానే… పార్టీకి పూర్వ వైభవం కొన్ని రోజుల్లోనే వచ్చేస్తుందని కూడా ఆశపడుతున్నారు.

Comments are closed.