రేవంత్‌ కీన్‌గా అబ్జర్వ్‌ భారతి

Revanth-Reddy-Comments-on-YS-Bharathi-Ear-rings

Revanth-Reddy-Comments-on-YS-Bharathi-Ear-rings

వార్తల్లో వ్యక్తులు అంటూ అప్పుడప్పుడూ మీడియాలో కొన్ని కథనాలు వస్తుంటాయి. ఇటీవలి కాలంలో వార్తల్లో ఎక్కువగా తారసిల్లుతున్న వ్యక్తుల గురించి.. వారిని వార్తల్లోకి తీసుకు వస్తున్న అంశాల గురించి ఆ కథనాలు మనకు వివరిస్తాయి. రాజకీయ నాయకులు పరస్పరం వ్యక్తిగత విమర్శలకు తెగబడే అనేక సందర్భాల్లో మనకు ఇలాంటి వార్తల్లో వ్యక్తులు అనేకులు దొరుకుతారు. కానీ ఇప్పుడు… నాయకులు వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం మానేసినట్లున్నారు. మెజారిటీ ఆస్తిగత విమర్శలు చేసుకోవడం అనేది చాలా పరిపాటిగా మారింది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు తన ఆస్తులను ప్రకటించిన వెంటనే ఆస్తిగత విమర్శలు మొదలయ్యాయి.

నా ఆస్తులు ఇంతే.. జగన్‌ ఆస్తులు ఎంతో చూడండి.. అంటూ చంద్రబాబు గొడవ చేయడం ప్రారంభించారు. నీ ఆస్తులు చూపినవి అవీ.. దాచినవి ఏవీ? అంటూ వైకాపా వారు అడగడం మొదలెట్టారు. మధ్యలో నాయకుల విమర్శలు ఆస్తిగత విషయాల మీదనుంచి వస్తుగత విషయాల మీదికి మళ్లిపోయాయి. ఆస్తుల విషయంలో చంద్రబాబునాయుడు పెద్దగా కార్నర్‌ చేయడానికి వైకాపాకు అవకాశం దక్కలేదు. అందుకే ఆడలేని నర్తకి మద్దెల ఓడన్న చందంగా నారా చంద్రబాబునాయుడు కోడలు బ్రహ్మణి వేసుకున్న వజ్రాభరణాల మీదికి ఫోకస్‌ పెట్టాయి. ఆ వజ్రాభరణాల ఖరీదెంతో చెబుతారా? అవి బాలకృష్ణ తీసిచ్చినవి.. నందమూరి వారు, ఎన్టీఆర్‌` బాలయ్యలు సుదీర్ఘ కాలం సినీ హీరోలుగా సంపాదించిన సొమ్ముతో చేసినవి. అక్రమార్జనలు కాదు. అధికారం ముసుగులో దోపిడీ కాదు.. అంటూ తెదేపా వారు విరుచుకు పడ్డారు. కానీ బ్రహ్మణి వేసుకున్న నగలను వార్తల్లోకి తేవడం వారిని నొప్పించింది.

అయినా, నేటి రాజకీయాల్లో తమలపాకుతో నువ్వొకటంటే.. తలుపుచెక్కతో నేనొకటంటా… అనే వైఖరితో నాయకులు నిత్యం కలబడిపోతుంటారు కదా..! దానికి తగ్గట్లుగానే తెదేపానుంచి రేవంత్‌రెడ్డి అదేతీరులో స్పందించారు. జైలులో జగన్‌తో ములాఖత్‌ లకు వెళ్తున్నప్పుడు భారతి వేసుకుంటున్న వజ్రాలు పొదిగిన చెవిదుద్దుల విలువెంతో చెప్పాలంటూ ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. అవి ఎవరు ఎలా కొన్నారో వివరాలు కూడా చెప్పమంటున్నారు. రేవంత్‌ టీవీల్లో చాలా కీన్‌గా అబ్జర్వ్‌ చేస్తున్నట్లుంది మరి!

Comments are closed.