రాజకీయం అంత వీజీ కాదు.. జగన్ బాబూ!

Politics are not mush easier

Politics are not mush easier

బహుశా రాజకీయాలంటే ఇలా ఉంటాయని జగన్ ఏనాడూ అనుకుని వుండకపోవచ్చు. వ్యాపారంలో బమ్మిని, తిమ్మిని చేసి, ఈ కంపెనీకి ఆ కంపెనీని జోడించి, అందులో డబ్బులు ఇందులోకి తెచ్చి, వందను వేయి.. వేయిని లక్ష.. లక్షను కోటి చేసినట్లు, రాజకీయాల్లో కూడా నాలుగు పార్టీల్లోంచి నలుగురిని తెచ్చి, కాసిన్ని డబ్బులు జల్లి, ఓట్ల పంట పండించుకుని, ఆపై ఖజనా నింపేసుకోవచ్చని అనుకుని వుంటారు. రెండు రూపాయికాసులు ఓ దగ్గర చేరితే రెండవుతాయి. అది బొక్కసానికి బలమవుతుంది. అది వ్యాపార సూత్రం. కానీ రెండు పార్టీల నుంచి ఇద్దరు మనుషులను తెచ్చి ఓ చోట పెడితే, అది ఇంటిపోరుగా మారుతుంది… పార్టీకి చేటు చేస్తుంది. ఇది రాజకీయ సూత్రం.

పాపం, వ్యాపారమే, తప్ప రాజకీయం తెలియని జగన్ (తెలిసి వుంటే జైలులో ఎందుకు కూర్చుంటారు ఇన్నాళ్లు?) ఇప్ప్పుడు ఇలాంటి వ్యవహారాలతో ఇబ్బంది పడుతున్నారు. పార్టీ పెట్టినప్పుడు బాగానే వుంది. ఎన్నికలు దగ్గర్ల్లో లేవు కాబట్టి వచ్చినవారు వచ్చారు. నడిచింది. ఎన్నికల్లో దగ్గర్లోకి వచ్చేసరికి అసలు సిసలైన రాజకీయం ప్రారంభమైంది. ఎవరు పడితే వారు జగన్ దగ్గర జైల్లో టోకెన్ తీసుకుని, ఇంటికెళ్లి పెద్దమ్మ దగ్గర కండువా అందుకుంటున్నారు. ఉన్న ఉద్యోగాలు తక్కువ, అభ్యర్థులు ఎక్కువ కావడంతో పైరవీలు, పేచీలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు జగన్ కు తెలిసి వస్తోంది. పార్టీని నడపడం అంటే ఎంత తలకాయనొప్పో.

కప్పలను తక్కెట్లో వేసి తూచడం అంటే, బినామీ కంపెనీలు పుట్టించినంత తేలికకాదని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. కాంగ్రెస్ ను తిట్టిపోయడం సులువు. ప్రతి దానికీ అధిష్టానమే నిర్ణయం తీసుకోవాలని అనేయడం మరీ సులువు. బాబు పార్టీలో మోనోపలీ వుందని అనేయడం కాదు. కానీ మరి ఇప్పుడు జగన్ బాబు చేస్తున్నదేమిటి? మీ నియోజకవర్గం వరకు మీరు చూసుకోండి. మిగిలిన వ్యవహారాలు మీకు అనవసరం అన్నది ఆయన ట్యాగ్ లైన్. కానీ అందరు నాయకులకు ఇది వర్తింపచేయాలంటే కష్టం. కొందరు జిల్లా స్థాయి నాయకులుంటారు. మరికొందరు ప్రాంతీయ నాయకులుంటారు. అందునా మంత్రిగా చేసిన వారికి కనీసం అరడజను మంది ఎమ్మెల్యేల మద్దతయినా ఉంటుంది. వీరంతా ఎప్పుడూ ఆ నాయకుడినే నమ్ముకుని వుంటారు. వారి సంగతి పట్టించుకోకుండా, తన మేలు మాత్రమే చూసుకుంటానమ్టే నడవదు.. కుదరదు. కొణతాల, కొండాసురేఖ ఇంకా ఎవరైనా ఇక్కడే వస్తోంది జగన్ తో తంటా.

కొణతాలకు అనకాపల్లి సీటు ఇవ్వడం వరకు జగన్ వచ్చిన చిక్కులేదు. కానీ కొణతాలను నమ్ముకుని వున్న వారి మాటేమిటి? విశాఖ సిటీలో, రూరల్ లో కొంతమంది అనుచరులకైనా ఆయన టికెట్లు ఇప్పించుకోవాల్సి ఉంది. పార్టీలో తనకు పట్టు వుందని నిరూపించుకోవాల్సి ఉంది. కానీ జగన్ వైఖరితో ఇది సాధ్యం కాదని తేలిపోయింది. అందుకే ఇప్పుడు కొణతాల తన స్వంత పార్టీవైపు చూస్తున్నారు. కాంగ్రెస్ లో వున్నంత కాలం ఆయన జిల్లా రాజకీయాల్లో తిరుగులేని ప్రభ వెలిగించారు. అప్పుడు కూడా విశాఖ సిటీ రాజకీయాల్లో వేలు పెట్టినప్పుడే హరితో విబేధాలు వచ్చాయి.

మేయర్ గా పనిచేయడం వల్ల హరికి సిటీ రాజకీయాలపై పట్టు వుంది. ఆప్పట్లోనే ఈ పట్టు కోసం కొణతాల, హరి ఢీకొన్న సందర్భాలు వున్నాయి. ఇవేవి జగన్ కు తెలియవు. పైగా జైల్లో వున్న జగన్ ను దాడి వీరభద్ర రావు కలిశారు. దాడి గురించి జగన్ కు శాసన మండలిలో ప్రతిపక్షనాయకుడు, సీనియర్ రాజకీయనాయకుడు అన్న ఫీడింగ్ ఒక్కటే వెళ్లి వుంటుంది. కొత్తగా పుట్టిన వైకాపాకు కర్త, కర్మ, క్రియ అన్నీ జగనే. అది అచ్చమైన ఫ్యామిలీ ప్రయివేట్ లిమిటెడ్. పోలిట్ బ్యూరో తదితర వ్యవహారాలు ఏమీ లేవు. ప్రయివేటు సిటీ బస్సు కనిపించిన చోటల్లా అగి, వస్తానన్న ప్రతివాడిని ఎక్కించుకున్న చందంగా వ్యవహరించడమే తప్ప, లోపలున్న వారి బాధలు పట్టవు.

ఇప్పుడు కొణతాల-దాడి వ్యవహారం జగన్ పార్టీకి బోలెడు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. విశాఖ జిల్లాలో పార్టీ వ్యవహారాలను ఇంతవరకు చూస్తున్న వ్యక్తి కొణతాల. ఆయనను నమ్ముకునే జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు ఇటు వచ్చేసారు. ఇప్పుడు వీరంతా మళ్ళీ వెనక్కు వెళ్తే, వైకాపా పరిస్థితి దయనీయంగా మారుతుంది. పైగా దాడి వెనకవున్న జనాలు పార్టీ జనాలు. కొణతాల వెనుక వున్న వారు అతగాడి అభిమానులు, అనుచరులు. పార్టీ జనాలు వెంట వస్తారో రారో తెలియదు, కానీ అనుచరులు, అభిమానులు వెన్నంటే వుంటారు. పైగా దాడి వీరభద్ర రావు వెంట వచ్చే కార్యకర్తలు వుండొచ్చుకానీ, నాయకులు తక్కువ. పైగా పంచాయితీ ఎన్నికల ముందు కొణతాలను కాంగ్రెస్ లోకి తీసుకుంటే, సహజంగానే గ్రామాల నాయకులంతా అటే మొగ్గుతారు. ఇప్పుడు జగన్ కు ధర్మసంకట స్థితి. దాడిని ఆపేస్తే, భవిష్యత్ లో వచ్చేవారికి తప్పుడు సంకేతాలు వెళతాయి.పైగా కొణతాలకు లొంగినట్లవుతుంది. అది ఇప్పటికే పార్టీలో వున్నవారికి తప్పుడు సంకేతాలను ఇస్తుంది.

ఎలాగూ చేతులు కాలిపోయాయి కాబట్టి, లోలోపల బాధపడుతూ వుండడమే తప్ప జగన్ చేయగలిగింది ఏమీ లేదు. అయితే ఇది ఆ పార్టీకి ఒక విధంగా పాఠం నేర్పిందనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైనా వెళ్లాలనుకుంటే, ముందు స్థానిక పరిస్థితులు సరి చూసుకుంటారు. అలాంటి వారిని రమ్మనె వుందు జగన్ జాగ్రత్త పడతారు ఇదొకటే గుడ్డులో మెల్ల. ఇదంతా  దాడి-కొణతాల వివాదం కాంగ్రెస్ కు, అందునా చిరంజీవి వర్గానికి కలిసి వచ్చింది. ఉత్తరాంధ్రలో కాస్త బలమైన, సౌమ్యుడు, అవినీతిరహితుడు ఆయిన నాయకుడని మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చినందుకు బొత్స అధిష్టానం దగ్గర మంచి మార్కులు సంపాదించుకుంటారు. పైగా చిరంజీవి-గంటా-బొత్స వర్గానికి బలం పెరుగుతుంది. అసలే వచ్చే ఎన్నికలను దృష్టిలో వుంచుకుని ఇప్పటి నుంచే తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నం బొత్స-చిరంజీవి వర్గం చేస్తోంది. ఇప్పుడు వారికి ఇది ప్లస్ పాయింట్. ఈ విషయంలో ముఖ్యమంత్రి వర్గం చేయడానికి ఏమీ లేదు. ఎందుకంటే కోస్తాలో బిసి బెల్ట్ ముందు ఆయన వర్గం ఎప్పుడో చేతులెత్తేసింది.

దానాదీనా, పగవున్న వాడిని కొట్టబోతే, భక్తి వున్న వాడికి తగిలినట్లు, దాడి వీరభద్రరావు తెలుగుదేశాన్ని వీడితే అది వైకాపాను అతలాకుతలం చేస్తోంది. ఇంకా ఈ తుఫాను ఎలా మళ్లుతుందో చూడాల్సివుంది.

Comments are closed.