నిజాం ఆస్పత్రి ప్రస్తుతానికి జగన్‌ పార్టీ కార్యాలయం

jagan-future-planning-in-nims

jagan-future-planning-in-nims

వైఎస్‌ జగన్‌కు నిజంగా ఒక మహదవకాశం చిక్కింది. ఏడు రోజుల నిరాహార దీక్షకోసం కొంత కష్టపడినా నష్టమేం లేదు గానీ.. దాని ఫలితంగా కొన్ని రోజుల పాటూ పార్టీకోసం నిరంతరాయంగా వ్యూహరచన చేయగల ప్రత్యక్ష వెసులుబాటును ఆయన సంపాదించుకున్నారు. ఏడురోజుల జగన్‌ దీక్ష భగ్నమై అప్పుడే మూడు రోజులు గడచిపోయాయి. ఆయన ఇంకా నిజాం ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) లోనే చికిత్స తీసుకుంటున్నారు. జగన్‌ ఆరోగ్యం కాస్త కుదుటపడినట్లుగానే ఉన్నదని విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు ఆయనతో పాటూ భార్య భారతి కూడా ఆస్పత్రిలోనే ఉంటున్నారు. జగన్‌ ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయి తిరిగి జైలుకు వెళ్లే వరకు ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం వరకు జగన్‌ వెంట ఆయనకు సహాయకురాలిగా ఉండవచ్చు నంటూ భార్య భారతికి సీబీఐ కోర్టు మానవతా దృక్పథంతో అనుమతి ఇచ్చింది.

ఇలాంటి వెసులుబాటు జగన్‌కు బాగా కలిసి వచ్చింది. నిజాం ఆస్పత్రి సాక్షిగా ఆయన రాజకీయ వ్యూహరచన చేసుకోవడానికి చాలా సావధానమైన అవకాశం ఆయనకు లభించింది. మాట్లాడలేనంత దారుణమైన స్థితిలో జగన్‌ ఏడోరోజు దీక్షనాడు కూడా లేరు. చికిత్స అందుతున్న ప్రస్తుత సమయంలో ఆయన కాస్త చురుగ్గానే కోలుకున్నారు. దానికి తగ్గట్లుగా రాష్ట్ర వ్యాప్త పార్టీ పరిస్థితిపై పూర్తి అవగాహన పెంచుకుంటున్న భార్య భారతి కూడా ఆయనకు పార్టీ పరిస్థితుల్ని నియోజకవర్గాల వారీగా నివేదిస్తున్నట్లు వాటిపై దంపతులు ఇద్దరూ చర్చోపచర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇతర నాయకులు జగన్‌ను కలవడానికి పోలీసు, కోర్టు అనుమతి ప్రస్తుతానికి లేకపోయినప్పటికీ, జగన్‌ స్వయంగా నిర్ణయం తీసుకోవాల్సిన సకల అంశాలూ భారతి ద్వారా ఆయన సముఖానికి వెళుతున్నాయి. ఆయన ఎంచక్కా ఆ విషయాలు అన్నిటినీ సావధానంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఇదివరకు భారతి లేదా, ఇతర నాయకులు ములాఖత్‌ల సమయంలో మాత్రమే జగన్‌తో భేటీ అయ్యేవారు. అప్పుడు వారు మాట్లాడుకోవడానికి సమయం చాలా పరిమితంగా ఉండేది. ఇప్పుడు అలాంటివేం లేదు. భారతి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన వెన్నంటి ఉంటోంది. నాయకులనుంచి తన వరకు వచ్చిన విషయాలు అన్నిటినీ ఆయనతో చర్చిస్తోంది. మరో మాటల్లో చెప్పాలంటే నిజాం ఆస్పత్రిని జగన్‌ ప్రస్తుతానికి తన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ క్యాంపు కార్యాలయంగా మలచుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని అనుకోవచ్చు. దీక్ష అనే తంతు ఒకటి జరగకుండా ఉంటే భార్యతో ఏకాంతంగా ఇన్ని సుదీర్ఘమైన సమయం గడపగల అవకాశం ఆయనకు మరో రూపంలో వచ్చి ఉండేదే కాదు.  పార్టీ గురించి ఇంత సాకల్యంగా వ్యూహరచన చేయగల అవకాశమూ దక్కేది కాదు. దాంతో.. దీక్ష, అనంతర చికిత్స మన మంచికే కలిసి వచ్చాయని జగన్‌ కోటరీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Comments are closed.