ఓపెనింగ్ అదిరింది..

Chandrababu-Naidu-Bus-Yatra-Updates

Chandrababu-Naidu-Bus-Yatra-Updates

రాష్ట్రస్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్న ఓ నాయకుడు రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి ఉందా? ఆ దమ్ము ఉన్న నేత ఎవరైనా ఉన్నారా? అంటే.. ఎవరూ లేరనే మాటే నిన్నటి వరకు వినిపించేది. తీవ్రమైన భావోద్వేగంతో ఒకరిని ఒకరు నమ్మలేని పరిస్థితుల్లో.. అందరినీ అందరూ అనుమానిస్తున్న క్లిష్టపరిస్థితుల్లో తెలుగువారందరినీ ఒకతాటి పైన నడిపించటం.. నిజాలు మాత్రమే చెప్పగలిగిన ధైర్యం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు మాత్రమే ఉందని తేలిపోయింది. ఆయన అన్నట్లు నాకీ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం ఓ ఏడాది ఇవ్వండి.. అన్నీ సమస్యలు తీరుస్తానన్న మాట ఎంత అక్షరసత్యమన్నది ఆయన తాజా పర్యటన ద్వారా స్పష్టమైంది. నాలుగు గోడల మధ్య సమాలోచనలు జరుపుతూ.. వ్యూహాలు ఖరారు చేస్తూ నిర్ణయాలు తీసుకునే కన్నా..ప్రజాక్షేత్రంలోకి వెళ్లి.. వారికి దిశానిర్దేశం చేసే సత్తా.. ఓపిక బాబుకు మాత్రమే ఉందని తేలిపోయింది.

ప్రజలు విపరీతమైన భావోద్వేగంతో ఉన్నారు.. అలాంటి పరిస్థితుల్లో మీరు యాత్ర చేయటం అంతమంచిది కాదంటూ నాయకులు అడ్డుచెబుతున్నా వినకుండా.. నేను చూసుకుంటానంటూ బయటకు వస్తున్న బాబు మీద చాలామందికి చాలా సందేహాలున్నాయి. బాబు తప్పు చేస్తున్నారా అనుకునేవాళ్ల నుంచి తొందరపడుతున్నారా? అనుకున్నవాళ్లు తక్కువేం కాదు. కానీ.. వారి సందేహాల్ని పటాపంచలు చేస్తూ.. ప్రజలకు కేవలం వాస్తవాలు చెప్పటంపై దృష్టి నిలిపిన చంద్రబాబు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఎన్డీఏ హయాంలో తాను రాష్ట్ర విభజనకు అడ్డు పడ్డానని ధైర్యం చెప్పిన ఆయన.. విభజనకు మద్దతుగా లేఖ ఇచ్చానని కూడా ఒప్పుకున్నారు. ఇంత ప్రాక్టికల్ గా మాట్లాడిన నేత ఇప్పటివరకు లేరనే చెప్పాలి. అయితే సమైక్యవాది కావాలి.. లేదంటే విభజనవాదివి అవ్వాలన్న రెండే రెండు ఆప్షన్లు పెట్టుకొని పరిమితులు గీసుకున్న సమయంలో.. ఆ పరిధి దాటి వాస్తవ దృక్ఫదంతో ముందుకెళ్లే అరుదైన వ్యూహ్యన్ని చంద్రబాబు పాటించారని చెప్పొచ్చు.

సీమాంధ్రుల మెప్పు కోసం ఒక మాట.. తెలంగాణ వారి మెప్పు కోసం మరోమాట కాకుండా.. తాను ఏం చేశానో.. ఎందుకు చేశానో ఆయన వివరిస్తున్న తీరు ప్రజల్ని ఆకట్టుకుంటోంది… ఆలోచింప చేస్తుంది. విభజన నిర్ణయం తీసుకుంటే.. అదెట్లా ఉండాలన్న అంశాన్ని నాలుగు గోడల మద్య పరిమిత పార్టీ సభ్యుల నేతృత్వంలో నిర్ణయం తీసుకునే కన్నా.. పోరాటాలు చేసే వారి మధ్య కూర్చొని నిర్ణయం తీసుకోవాలని బాబు చెబుతున్న దాన్లో సహేతుకత ఉందనే చెప్పాలి. ఒకసారి కుదరకపోతే.. పదిసార్లు కూర్చోవాలి. అప్పటికి కాకపోతే.. సమస్యకు పరిష్కారం దొరికేంతవరకూ విడవ కూడదని చెబుతన్న వాదన  న్యాయసమ్మతంగా ఉంది. గతంలో కొంతమంది హడావుడిగా తీసుకున్న నిర్ణయాలే.. ఇప్పుడు ఇరు ప్రాంతాల మధ్య లేనిపోని అపోహల్ని సృష్టించాయి.

ఒకవేళ విభజన అనివార్యం అయితే.. అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలే తప్ప ఒంటెద్దు పోకడ పోకూడదన్న దిశానిర్దేశమే ఇప్పుడు తెలుగు ప్రజలకు అవసరమైంది. ఎవరికి వారు.. ఏదోఒక ప్రాంత ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటున్న సమయంలో.. అందకు భిన్నంగా నిజాయితీతో.. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు.. తెలుగు ప్రజలకు తన అవసరం ఎంతో ఉందో తన ‘‘ఆత్మగౌరవ యాత్ర’’ తొలిరోజునే మరోసారి నిరూపించారు.

Comments are closed.