జగన్ దీక్షకు నిబంధల కొర్రీలు?: షర్మిల బస్సు యాత్ర

andhrapradesh-ys-jagan-s-fast-against-the-rules

andhrapradesh-ys-jagan-s-fast-against-the-rules

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నిరాహారదీక్షకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రేపు ఆదివారం ఉదయం ఆరు గంటలకు ఆయన దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే, జగన్ దీక్షకు జైలు నిబంధనలు అంగీకరించవని జైలు అధికారులు అంటున్నారు.

తాను దీక్ష చేయబోతున్నట్లు వైయస్ జగన్ తమకు రాతపూర్వకంగా తెలియజేయలేదని కూడా చెప్పినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.వైయస్ జగన్ దీక్ష చేపడితే ప్రత్యేక ఖైదీ హోదాను రద్దు చేయాలని కోర్టును కోరుతామని వారంటున్నారు. నిబంధనల ప్రకారం జైలులో దీక్షలు నిషిద్ధమని వారు చెబుతున్నారు. జగన్ దీక్ష చేస్తే ములాఖత్‌లు ఆపేస్తామని జైలు అధికారులు చెప్పారు కాగా, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైయస్ జగన్ సోదరి సీమాంధ్రలో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెబుతున్నారు.

త్వరలో ఆమె బస్సు యాత్రను ప్రారంభిస్తారని అంటున్నారు. నిజానికి, విభజనపై ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో బస్సు యాత్ర చేపట్టాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అనుకున్నారు. కానీ, పరిస్థితులు అనుకూలించకపోవచ్చుననే ఉద్దేశంతో ఆయన దాన్ని విరమించుకున్నారు. వైయస్ జగన్ హైదరాబాదులోని జైలులో దీక్ష చేపట్టకూడదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు టి. హరీష్ రావు అన్నారు.

రాజమండ్రి జైలులో గానీ విశాఖపట్నం జైలులో గానీ జగన్ దీక్ష చేపట్టాలని ఆయన అన్నారు. తెలంగాణ సంపదను దోచుకోవడానికే జగన్ దీక్ష చేస్తున్నారని ఆయన అన్నారు. విజయమ్మ దీక్షను పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వీధి నాటకంగా పోల్చారు. జగన్ దీక్షను ఇంటి నాటకంగా అభివర్ణించారు. జైలులో దీక్షకు నిబంధనలు అనుమతించవంటూ వచ్చిన వార్తలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తీవ్రంగా తప్పు పట్టారు. ములాఖత్‌లను ఆపే హక్కు, ప్ర్తత్యేక ఖైదీ హోదాను రద్దు చేసే నిబంధనలు లేవని వారన్నారు. ప్రత్యేక ఖైదీ హోదా అనేది స్థాయిని బట్టి కల్పించేదని, ములాఖత్‌లు జైలు మాన్యువల్ ప్రకారం సంక్రమించే హక్కు అని అంటున్నారు.

Comments are closed.