బిజినెస్ మ్యాన్ కాదు.. సూపర్ సీమాంధ్ర నేతలు

రాజ్యసభలో టీడీపీ ఎంపీలపై ఓ ముద్ర ఉంది. రాజకీయ నేతల్ని కాకుండా.. పారిశ్రామికవేత్తల్ని చంద్రబాబు నాయుడు టిక్కెట్లు ఇచ్చి ఎంపీలను చేస్తాడు అని. అయితే.. రెగ్యులర్ రాజకీయ నాయకుల కంటే కూడా.. ఈ బిజినెస్ మ్యాన్లు పోషిస్తున్న పాత్ర సీమాంధ్రలో ఇప్పుడు వారిని హీరోలుగా మార్చింది. నిన్నమొన్నటివరకు సుజనా చౌదరి, సీఎం రమేష్ లు కేవలం పారిశ్రామికవేత్తలుగా మాత్రమే తెలుసు. వారి వంటికి రాజకీయాలు పడవని.. కేవలం తమ వ్యాపార ప్రయోజనాల కోసమే.. చంద్రబాబును మేనేజ్ చేసి.. ఎంపీ పదవులు కొట్టేశారన్న విమర్శ ఉంది.

కానీ.. అవన్నీ విమర్శలే తప్ప వాటిలో పస లేదని తేలిపోయింది. పెద్ద పెద్ద తురుంఖాన్లు లాంటి సీనియర్ పొలిటీషియన్లు సీమాంధ్ర ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. రాష్ట్ర విభజనపై గొంతెత్తి.. ఒంటి చేత్తో పోరాటం చేస్తున్నది మాత్రం ఈ ఇద్దరే. వీరి వాదనా పటిమ చూసి మిగిలిన రాజకీయనేతలు సైతం ఆశ్చర్యపోతున్నారు. మామూలు రాజకీయ నాయకులు సైతం ప్లకార్డులు పట్టుకోవటం.. అదే పనిగా సభలో అరవటం..గోల చేయటానికి సిగ్గు పడతారు. కానీ.. సుజనా చౌదరి, సీఎం రమేష్ లు మాత్రం అందుకు భిన్నంగా ఎలాంటి మెహమాటాలకు గురి కాకుండా.. రాష్ట్ర విభజనపై సీరియస్ గా లీడ్ తీసుకోవటం ఇప్పుడు సీమాంధ్ర ప్రజల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా వారిపై పెరిగిన క్రేజ్ ను చూసినప్పుడు… ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో వీరిని లోక్ సభ ఎంపీ స్థానాల నుంచి బరిలోకి దింపినా ప్రయోజనం గెలుస్తారన్న వాదనలు తెరపైకి రావడం గమనార్హం. మొత్తమ్మీద.. రాష్ట్ర విభజన వ్యవహారం.. టీడీపీలోని ఇద్దరు బిజినెస్ మేన్ లను.. పక్తా రాజకీయవేత్తలుగా మార్చింది.

Comments are closed.