పార్టీ ఆత్మ‘గౌరవాన్ని’ పెంచారు

Chandrababu-Naidu-Athma-Gauravam-Yatra-in-Seemandhra

Chandrababu-Naidu-Athma-Gauravam-Yatra-in-Seemandhra

కాలం కలిసి రానప్పుడు.. నిరాశతో.. నిస్పృహతో ఉండిపోతారు. కనీస ప్రయత్నం చేసేందుకు సైతం ఇష్టపడరు. అదే.. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని అందరూ భావించి.. వెనక్కి తగ్గుతున్నప్పుడు.. ముందుకెళ్లటం కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. దూరదృష్టి.. సమర్థత.. నాయకత్వ పటిమ ఉన్న  నాయకత్వం ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోగలుగుతుంది. ఆ విషయంలో.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సగటు రాజకీయపార్టీ ఏదీ.. జనాల్లోకి వెళ్లేందుకు జంకుతున్న సమయంలో.. ఆయన చొరవ చూపి బయటకెళ్లటమే కాదు.. విజయవంతంగా ఆత్మగౌరవ యాత్ర తొలిదశను పూర్తి చేయటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఆత్మగౌరవ యాత్ర సమయంలో ఆయన చూపిన తెగువ, మొండితనం.. పట్టుదల వరకే పరిమితం కాకుండా.. ఆగ్రహంతో ఉన్న ప్రజలకు ఏం చెబుతారా? అని ఆసక్తిగా చూసిన వారందరికీ తన అనుభవాన్ని రంగరించి వ్యూహాత్మకంగా సాగిన వైనం విస్తుపోయేలా చేసింది. అన్నీ వేళ్లు తననే దోషిగా చూపి.. రాజకీయ లబ్థి పొందేందుకు కూడబలుక్కున్న వేళ.. ఆయన ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా నిలువరించారనే చెప్పాలి. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. సీమాంధ్రలో ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. సీమాంధ్రుల నుంచి ఆ స్థాయి వ్యతిరేకత పెల్లుబుకుతుందని ఊహించని పార్టీలు చేష్టలుడిగిపోయాయి. ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్న వేళ.. చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర పేరిట బయటకు రావటమే కాదు.. రాష్ట్ర విభజనకు దారి తీసిన పరిస్థితులు.. భావోద్వేగాల కన్నా కూడా.. ఓట్లు, సీట్ల దందాతోనే రాష్ట్ర విభజనకు పూనుకున్నారన్న విషయాన్ని కుండబద్ధలు కొట్టారు. తాము లేఖ ఇచ్చినందు వల్ల  విభజన జరిగిందన్న పార్టీల ఆరోపణను తిప్పి కొట్టటమే కాదు.. ఎన్డీఏ హయాంలో విభజనను అడ్డుకున్న పరిస్థితులను.. తాజాగా అనుకూలంగా లేఖ ఇవ్వటానికి దారి తీసిన పరిస్థితులను నిజాయితీతో చెప్పిన వైనం ప్రజల్ని ఆకట్టుకుంది.

రాష్ట్ర అభివృద్ధి కోసం తాను పడిన శ్రమ గురించి చెప్పిన ఆయన.. విభజన వల్ల కలిగే ఇబ్బందుల్ని ప్రస్తావించారు. విభజన వ్యవహారం మొత్తం రాజకీయ నాటకమే తప్పించి మరోటి కాదన్న బలమైన వాదనను వినిపించారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ మాట తప్పి.. మడమ తిప్పి.. సమైక్యం అంటూ రాగాలు పలకటానికి వెనుకున్న వ్యూహాన్ని ప్రజల్లోకి  తీసుకెళ్లటంలో విజయవంతమయ్యారు. తెలంగాణలో టీఆర్ఎస్ తో..  సీమాంధ్రలో పిల్ల కాంగ్రెస్ తో చట్టాపట్టాలు వేసుకొని… అంతిమంగా కేంద్రంలో యూపీఏ-3 ఏర్పాటుకు చేస్తున్న కుట్రను ఆయన బద్ధలు కొట్టారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వివరించారు. ప్రజల మధ్య తాను ఉండటమే కాదు.. పార్లమెంటులో తెలుగువాడి వాణిని వినిపించటంలో టీడీపీ చేసిన కృషిని సీమాంధ్రులు మర్చిపోలేరు.

పట్టుమని పది మంది లేకున్నా.. ఉన్న ముగ్గురు, నలుగురితోనే నెట్టుకొస్తూ.. అంత పెద్ద పార్లమెంటు జరగనీయకుండా చేయటంలో సక్సస్ అయ్యారు. ఇప్పటివరకు తెలంగాణ వాదుల వాదనను మాత్రమే తెలిసిన పలు జాతీయ పార్టీలకు సైతం.. సమైక్యాంధ్ర అవసరాన్ని నొక్కి చెప్పటమే కాకుండా.. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ వ్యూహాన్ని బద్ధలు కొట్టటంలో తెలుగు తమ్ముళ్లు విజయవంతమయ్యారు. వారు చేసిన ప్రయత్నం అధికార పార్టీకి చెందిన సీమాంధ్ర ఎంపీలపై ఎంతటి ప్రభావాన్ని చూపిందంటే.. మనసులో ఇష్టం లేకున్నా.. సమైక్యవాదం వినిపించాల్సిన తప్పనిసరి పరిస్థితిని తెలుగు తమ్ముళ్లు కల్పించారు. రాష్ట్రం అంతులేని అనిశ్చితిలో మునిగిపోయిన నేపథ్యంలో.. అటు పార్టీని.. ఇటు ప్రజలకు భరోసా కల్పించేందుకు చంద్రబాబు చేసిన కృషి.. తెలుగు ప్రజల పట్ల ఆయనకున్న కమిట్ మెంట్ ను చెప్పకనే చెప్పినట్లయింది.

Comments are closed.