సోనియమ్మ ఎత్తుకు బాబు పై ఎత్తు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ చతురత అందరికీ తెలిసిందే. అందులో అణుమాత్రం సందేహం లేదు. కానీ చంద్రబాబు అన్నవాడు మరీ ఘటికుడు. వంటినిండా నూనెరాసుకుని తిరిగేటైపు. అందుకే సోనియా ఎత్తుకు బాబు దొరకలేదు. క్యాబినెట్ మీట్ కు ముందే, ఎందుకయినా మంచిదని బాబును కాస్త నొక్కి పెడదామని సోనియా ప్లాన్ వేసినట్లు బోగట్టా.  అందుకే దిగ్గూబాబు వెళ్లి సిబిఐ చీఫ్ ను కలిసాడు. కానీ ఎలా పొక్కిందో, బాబు ఎలా పసిగట్టారో మొత్తానికి జరిగిపోయింది. దాంతో బాబు కాస్త గాభరాపడ్డ మాట వాస్తవం. తనపై సిబిఐ ప్రయోగానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పరొక్షంగా విలేకరుల సమవేశంలో ఆరొపించారు.

ఇదిలా వుంటే సీమాంధ్ర కాస్తా, రాష్ట్ర విభజనపై భగ్గుమంది. తను కూడా నిరశన తెలపక తప్పని పరిస్థితి బాబుకు ఏర్పడింది. అక్కడే ఆయన తన చాణక్యం ఉపయోగించారు. నిరశన వేదికగా ఢిల్లీని ఎంచుకున్నారు. దీని వెనుక బోలెడు ఉపయోగాలున్నాయి. జాతీయ మీడియా ఫోకస్ రావడం అతి కీలకం. పైగా ఇప్పుడు సోనియా సిబిఐ ని ఉసిగొలిపేందుకు సాహసించదు. అలా చేస్తే, నిరశన చేసినందుకే అని మీడియానే ఫోకస్ చేస్తుంది.

అంతకు మించి ఇంకో పరమార్థముంది. ఇక్కడ జగన్ నిరశన ప్రారంభమవుతుంది. జనం సహజంగానే రెండు నిరశనలకు స్పందనను గమనిస్తారు. ఒక వేళ జగన్ శిబిరానికి జనం తాకిడి ఎక్కువ వుంటే, అది బాబుకు మైనస్ అవుతుంది. దాని నుంచి కూడా ఇలా ఢిల్లీకి వేదిక మార్చడం ద్వారా తప్పించుకోవచ్చు.  అదీ బాబు చాణక్యం అంటే. రాజకీయాల్లో అలాంటి వారే నిలదొక్కుకోగలరు మరి

Comments are closed.