ఇదిగో ఎన్టీఆర్ ఏం చెప్పారో చూడు!: హరికి కెటిఆర్

andhrapradesh-ntr-is-not-against-division-says-ktr

andhrapradesh-ntr-is-not-against-division-says-ktr

హైదరాబాద్: తెలంగాణ కోసం చాలామంది ప్రాణాలు కోల్పోయారని, ఇప్పుడు జై ఆంధ్ర కోసం చాలామంది అమరులు అవుతున్నారని నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు చెప్పిన విషయాన్ని తెలుగుదేశం పార్టీ నేత నందమూరి హరికృష్ణ గుర్తుంచుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలో విడిపోయి కలిసుండటమే మేలని నాడు ఎన్టీఆర్ చెప్పారని చెప్పిన కెటిఆర్ అందుకు సంబంధించిన ప్రతులను మీడియాకు చూపించారు. విడిపోయి కలిసుండాలని ఎన్టీఆర్, ఎఎన్ఆర్ ప్రతిపాదన చేశారని చెప్పారు. తండ్రిగారి ఆశయ సాధన కోసం పోరాడితే బాగుంటుందని హరికృష్ణకు సూచించారు.

హరికృష్ణ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడి చరిత్ర మర్చిపోవడం దారుణమని, తెలుసుకొని మాట్లాడాలన్నారు. ఎన్టీఆర్ ప్రేరణతోనే నాడు సినీ నటులంతా జై ఆంధ్రకు మద్దతు తెలిపారని గుర్తు చేశారు. జై ఆంధ్రకు మద్దతు తెలుపుతూ… కృష్ణ, విజయనిర్మల, కృష్ణంరాజు, ఎఎన్ఆర్, శోభన్ బాబులు దీక్షలు కూడా చేశారని చెప్పారు. తెలుగు చలన చిత్ర పరిశ్రణ విభజనను కోరుకుంటుందన్నారు.

విద్వేషాలు లేని విభజనను నాడు ఎన్టీఆర్ కోరుకున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ పైన కెటిఆర్ నిప్పులు చెరిగారు. అవకాశవాద రాజకీయాలకు టిడిపి ప్రతిరూపమన్నారు. తెలంగాణకు కట్టుబడి ఉంటామన్న టిడిపి ఇవాళ దివాళాకోరు రాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న టిడిపి ఎంపీల వైఖరితో ఆ పార్టీ అసలు రంగు బయటపడిందన్నారు. చీమలు పెట్టిన పుట్టల్లో పాములు దూరినట్లు.. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో చంద్రబాబు నాయుడు దూరి అరాచక రాజకీయాలు చేస్తున్నారన్నారు.

Comments are closed.