బాబుతో బిజెపి అవగాహన: టీపై మారిన వ్యూహం?


న్యూఢిల్లీ: తెలంగాణపై తీవ్రమైన ఇరకాటంలో పడిన కాంగ్రెసు పార్టీని దెబ్బ తీసేందుకు బిజెపి వ్యూహం మార్చిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని వచ్చే ఎన్నికల కోసం బిజెపి దువ్వుతున్న విషయం తెలిసిందే. అటు చంద్రబాబుతో కలిసి పనిచేయడానికి, కాంగ్రెసును దెబ్బ తీయడానికి మార్గం సుగమం చేసుకుంటూ ముందుకు సాగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గురువారం పార్లమెంటులో బిజెపి నేత సుష్మా స్వరాజ్ వ్యవహరించిన తీరు ఆ అనుమానాలకు తావు కల్పిస్తోంది.

తెలుగుదేశం పార్టీతో వచ్చే ఎన్నికల్లో చేతులు కలపడానికి వీలుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా బిజెపి వ్యవహరించడానికి సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. లోక్‌సభ కార్యక్రమాలకు అడ్డుతగులుతున్న సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల సస్పెన్షన్‌ను అడ్డుకోవడం దానికి నిదర్శనంగా చెబుతున్నారు. లోక్‌సభలో పోడియం వద్ద గొడవ చేస్తున్న నలుగురు తెలుగుదేశం సభ్యులతోపాటు కొందరు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని బిజెపి అడ్డుకుంది.

కాంగ్రెసు ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు గత రాత్రి నుండి లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్, సిపిఐ పక్ష నాయకుడు బాసుదేవ్ ఆచార్య, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులతో చర్చలు రంగం సిద్దం చేసుకున్నట్లు చెబుతున్నారు. స్పీకర్ మీరాకుమార్ చాంబర్‌లో గురువారం ఉదయం పది గంటలకు జరిగిన అఖిల పక్ష సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ పదకొండు మంది సభ్యులను సస్పెండ్ చేయటం గురించి ప్రస్తావించి బిజెపి అనుమతి తీసుకున్నారు. ముందు నిర్ణయించిన ప్రకారం సభ్యుల సస్పెన్షన్‌పై నిరసన తెలిపిన అనంతరం బిజెపి సభ నుంచి వాకౌట్ చేయాలి.

అయితే సుష్మాస్వరాజ్ ఆఖరు నిమషంలో తమ వ్యూహాన్ని మార్చుకుని సభ్యుల సస్పెన్షన్‌ను వ్యతిరేకించటం కాంగ్రెసును దిమ్మతిరిగేలా చేసింది. బిజెపితోపాటు ములాయం సింగ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ కూడా సభ్యుల సస్పెన్షన్‌ను వ్యతిరేకించటంతో కాంగ్రెస్ ముందుకు సాగలేకపోయింది.

గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం సభలో గొడవ చేసిన తెలంగాణ పార్లమెంటు సభ్యుల సస్పెన్షన్‌ను బిజెపి సమర్థించింది. అయితే గురువారం మాత్రం సమైక్యాంధ్ర కోసం గొడవ చేస్తున్న టిడిపి, కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్‌ను గట్టిగా వ్యతిరేకించటం ద్వారా బిజెపి కొత్త రాజకీయానికి తెరలేపింది. సుష్మాస్వరాజ్ లోక్‌సభలో సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ చెప్పిన మాటలు కూడా తెలంగాణ విషయంలో బిజెపి మనసు మారిందనే సంకేతాలిస్తున్నాయని అంటున్నారు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామంటూ చేసిన ప్రకటన తీరు సరిగా లేదని సుష్మా స్వరాజ్ తప్పు పట్టారు. అయితే, ఎలా చేసి ఉండాల్సిందనేది ఆమె చెప్పలేదు. ఈ స్థితిలో తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదిస్తే బిజెపి సమర్థిస్తుందా, ఏదైనా మెలిక పెడుతుందా అనేది అర్థం కావడం లేదు.