కానిస్టేబుల్ శ్రీనివాస్ సింహం అయితే.. మరి కేసీఆర్ అండ్ కంపెనీ?

KCR-Too-Banks-On-Simham-Dialogue

KCR-Too-Banks-On-Simham-Dialogue

శ్రీనివాస్ గుర్తున్నాడా? చాలామంది శ్రీనివాస్ లు ఉన్నారు. ఇంతకీ ఏ శ్రీనివాస్ గురించి అడుగుతున్నారంటారు. అదే.. కానిస్టేబుల్ శ్రీనివాస్ గుర్తున్నాడా? అని అడగండి.. ఆ.. మొన్నా మధ్య సభలోకి వెళ్లి లొల్లి చేసిండు ఆ శ్రీనివాసా అంటారు. కానీ.. ఘనత వహించిన కేసీఆర్ కి అతను.. సింహంలా కనిపిస్తున్నాడు. ఆయన ఏమంటాడు.. ‘‘మన కానిస్టేబుల్ శ్రీనివాస్ ఉన్నాడు చూశారా. సింహం లెక్కల అరవైవేల మంది మధ్యకి వెళ్లి జై తెలంగాణ అన్నాడు. అలా అనేందుకు ఎన్ని గుండెలు ఉండాలి? సింహం ఎప్పుడూ సింగిల్ గా వెళుతుంది. మన శ్రీనివాస్ కూడా అంతే. సింహం లెక్కన సింగిల్ గా వెళ్లి ధైర్యం చెప్పి వచ్చాడు. అతను ఆదర్శం కావాలి’’ అని ఇష్టారాజ్యంగా పొగిడేశారు.

మంచి, చెడుల గురించి మాట్లాడితే వినే రోజులు పోయాయి. ఒకవేళ స్వార్థ రహితంగా మాట్లాడినా.. సందేహంగా చూడటం అలవాటైంది. అందుకే.. ఇది తప్పు.. ఒప్పు అనే కంటే కూడా.. ప్రాక్టికల్ గా మాట్లాడుకోవటంలో ఉన్నంత సుఖం దేన్లోను ఉండదు.

కేసీఆర్ కి కానిస్టేబుల్ శ్రీనివాస్ సింహం లెక్కన కనిపిస్తున్నాడు. బాగుంది. మరి.. ఆయన కొడుకు చాలా పెద్ద రుస్తుం లెక్కన మాట్లాడుతుంటాడు. ఆవేశంతో అప్పుడప్పుడు చొక్కా చించేసుకుంటాడు. మరి.. అతగాడ్ని ఏపీ ఎన్జీవోల సభకు పంపి.. జై తెలంగాణ నినాదం కూడా అనిపించొచ్చు కదా. మా వాడు సింహం కాదు కదా అంటారా కేసీఆర్. కేటీఆర్ అయితే ఫారిన్ లో చదువుకున్నోడు.. అసెంబ్లీలో పెద్దాయన మీద దాడి లాంటివి చేస్తాడు కానీ ఇట్లాంటివి చేతకాదంటారా? మరి.. మేనల్లుడు హరీశ్ రావు ఉన్నాడు కదా. బుల్లెట్టు బండి మీద దర్జాగా తిరిగే మనిషి.. మాంచి ఒడ్డు, పొడుగు ఉన్నోడు. దమ్ముగా మాట్లాడేటోడు.. మరి అలాంటోడైతే సింహంగా చెప్పినా కాస్త నప్పుతాడు. మరి.. అతగాడ్ని పంపిచొచ్చు కదా. చరిత్రలో మిగిలిపోతాడు. కోట్లాది మంది తెలంగాణ ప్రజల్లో హీరోగా నిలిచిపోతాడు. జాతీయ మీడియా అటెన్షన్ కూడా వస్తుంది కదా?

సింహం చేసే పనులు మీ ఫ్యామిలీలో ఎవరూ చేయరంటారా? ఎవరో ఎందుకు మీరే ఆ పని చొయచ్చు కదా. మీరు కనుక చేసి ఉంటే.. మొదటిపేజీ కథనం అయ్యేది. కవరేజ్ లో కాస్త ఎక్కువతక్కువ వచ్చినా.. సీమాంధ్ర మీడియా పెట్టుబడిదారులకు అని హెచ్చరిక చేసే ఛాన్స్ కూడా ఉండేది. ఇలాంటి సువర్ణావకాశాలను ఎందుకు మిస్ చేసుకుంటారు?

సింహం లాంటి పోలికలు పోల్చడం.. అమాయక ప్రజల్ని రెచ్చగొట్టం.. అలాంటివాళ్లను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పే కేసీఆర్ అలాంటి పనులు తన ఇంట్లో వాళ్లు మాత్రం చేయాలనుకోరు. అంత పెద్ద నాయకుడి ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటివి చేస్తే ఏం బాగుంటుందన్న సందేహం వచ్చిందా? ఇంకా వారి పరివారంలో ఉన్న.. ఏ ఈటెల రాజేందర్ ఫ్యామిలీ నుంచో.. లేదంటే స్వామిగౌడ్, కాదంటే దేవీప్రసాద్, శ్రీనివాస్ గౌడ్ వీరెవరూ కాదంటే కోదండరాం సార్ ఇంటి నుంచి ఎవరో ఒకరు చేయొచ్చు కదా?

జంతువులకు రాజైన మృగరాజు పోలికకు సామాన్య జనాలు సరిపోతారు. కానీ.. జనాలున్న రాజ్యాన్ని ఏలటానికి మాత్రం కేసీఆర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సరిపోతారా? దానికి కానిస్టేబుల్ శ్రీనివాస్ సరిపోడా? సామాన్య జనాలను రెచ్చగొట్టటం.. వారిని భావోద్వేగాలకు గురి చేసి పబ్బం గడుపుకోవటం కేసీఆర్ కు అలవాటే. ఇప్పుడు కూడా ఆయన అదే వ్యూహాన్ని కొనసాగిస్తున్నారు. కేసీఆర్ అంతటోడు.. కానిస్టేబుల్ శ్రీనివాస్ ను సింహం అన్నాడు. ఈసారి అలాంటి సభ జరిగితే.. అలాంటి వాళ్లు పదుల సంఖ్యలో తయారవుతారు. ఎందుకంటే.. వాళ్లకు కూడా సింహం అనిపించుకోవాలని ఉంటుంది కదా? కేసీఆర్ కి కూడా అదే కావాలి. ఇంతకీ కానిస్టేబుల్ శ్రీనివాస్ సింహం అయితే.. మరి కేసీఆర్ అండ్ కంపెనీలో వారంతా ఏమిటి?

Comments are closed.